జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోండి
-పిఎస్ సి & కెవిఎస్ సి లో మెగా జాబ్ మేళా
-మెగా జాబ్ మేళాలో 14 కంపెనీలు
-రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్
నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 10 . (నంది పత్రిక ):నంద్యాల జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. గురువారం నంద్యాల పట్టణంలోని పిఎస్ సి & కెవిఎస్ సి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఆవరణంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ జి రాజకుమారితో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు నిర్వహించిన మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలన్నారు. ఈ జాబ్ మేళాలో 14 పేరెన్నిక కంపెనీలో పాల్గొని దాదాపు 589 కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. చదువుకున్న నిరుద్యోగ యువత నిరుత్సాహపడకుండా ప్రతినెల జాబ్ మేళాను నిర్వహిస్తామని ఆసక్తిగల నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొనేందుకు అవసరమైన శిక్షణను పెంపొందించుకోవాలన్నారు. రాబోయే ఐదు సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. తనకు తెలిసిన హైదరాబాద్ కంపెనీ యాజమాన్యాలు కూడా జాబ్ మేళా నిర్వహించేందుకు ఉత్సాహం చూపుతున్నారని మంత్రి ఈ సందర్భంగా అన్నారు అన్నారు.జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఆసక్తికర రంగాలలో నైపుణ్యం గల శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. మెగా జాబ్ మేళాలో పాల్గొనే అవకాశాన్ని నిరుద్యోగ యువత చక్కగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువత తనకు నచ్చిన రంగంలో అన్ని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుంటే అంతే అనర్గళంగా మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. సంబంధిత రంగంలోని అన్ని అంశాలను ఆకలింపు చేసుకుంటే ఎవరైనా ప్రశ్నిస్తే తడుముకోకుండా సమాధానం ఇవ్వగలగరన్నారు. ఉమ్మడి సమావేశాల్లో భాగస్వాములయితే ఎప్పుడుకప్పుడు పరిస్థితులకు అనుగుణంగా సమాచారాన్ని సేకరించుకునే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు కోర్ సబ్జెక్టులలో కమాండ్ రోల్ ఉండడంతో పాటు అదనపు నైపుణ్యముల శిక్షణను తీసుకుంటే పోటీ పరీక్షలలో నెగ్గుక రాగలరని కలెక్టర్ సూచించారు. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పోటీ పరీక్షలు ఎలా ఉన్నాయనేది విశ్లేషించుకుని డిమాండ్ ను అనుసరించి అనునిత్యం నైపుణ్యతను పెంపొందించుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో పదవ తరగతి నుండి పీజీ వరకు 1500 మంది పాల్గొంటున్నారని అభ్యర్థుల సామర్థ్యాన్ని బట్టి సంబంధిత కంపెనీలు ఎంపిక చేసుకుంటాయన్నారు. విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని మధ్యలో నిలిపేయకుండా నిరంతరాయంగా కొనసాగించేలా కృత నిశ్చయంతో ఉండాలని కలెక్టర్ సూచించారు. యువతకు ఉన్న సామర్థ్యంలో స్థిరత్వం వచ్చేంతవరకు కష్టపడుతూనే ఉండాలని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో తల్లిదండ్రులకు భారం కాకూడదన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొనేందుకు పటిష్టమైన ప్రణాళిక రూపొందించుకొని అభివృద్ధి దిశలో పయనించేందుకు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ వెల్లడించారు.*
*మెగా జాబ్ మేళాలో అరబిందో ఫార్మసీ, అపోలో ఫార్మసీ,అమెజాన్, ఆల్ డిక్సన్ టెక్నాలజీస్, రేస్ డైరెక్ట్ సర్వీసెస్, నవత ట్రాన్స్పోర్ట్, పేటీఎం, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, శ్రీరామ్ చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్, మాళవిక డెవలపర్స్, ఫాక్స్ కాన్, ఈ ప్యాక్ టెక్నాలజీస్, ఫ్యూచర్ ప్రాపర్టీ సొల్యూషన్స్ కంపెనీ యాజమాన్యాలతో పాటు డిఎస్డిఓ శ్రీకాంత్ రెడ్డి, డిఆర్డిఏ పిడి శ్రీధర్ రెడ్డి, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ సోమశివారెడ్డి, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, జెకెసి కోఆర్డినేటర్ పార్వతి, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comment List