పేదల గృహ నిర్మాణాల కోసం అదనపు ఆర్థిక సహాయం

On

IMG_20250311_224351

-ఎస్సీ, బీసీలకు 50 వేలు, ఎస్టీలకు 75 వేలు, పివిటీజీలకు లక్ష రూపాయలు అదనపు ఆర్థిక లబ్ధి

-జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా

నంద్యాల ప్రతినిధి. మార్చి 11. (నంది పత్రిక ):జిల్లాలో అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గృహ నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సమావేశంలో హౌసింగ్ ఈఈ హరిహర గోపాల్, డ్వామా పిడి వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ ఎస్సీ,బీసీ, ఎస్టీ, పివిటిజి లకు గృహాలు మంజూరై ఇంకను వివిధ దశల్లో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న గృహాలను పూర్తి చేయడానికి అదనపు ఆర్థిక సహాయం అందించేందుకు అనుమతిస్తూ జిఓఆర్ టి నంబర్ 9  ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యంలో భాగంగా 2029 నాటికి 'అందరికీ ఇళ్లు' నిర్మించాలనే లక్ష్యంలో భాగంగా అసంపూర్తి నిర్మాణంలో ఉన్న గృహాలను పూర్తి చేయడానికి అదనపు ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. ఇళ్లు మంజూరై ఇంకనూ వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న ప్రస్తుత యూనిట్ విలువ 1.80 లక్షల రూపాయలకు అదనంగా ఎస్సీలకు 50 వేలు, బీసీలకు 50 వేలు, ఎస్టీలకు 75 వేలు, పివిటీజీలకు లక్ష రూపాయలు చొప్పున అదనపు సాయం అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. దీంతోపాటు స్వయం సహాయక సంఘాల సభ్యులకు 35 వేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకు రుణం పొందవచ్చన్నారు. ప్రజా ప్రతినిధులకు కూడా ఈ అంశాన్ని తెలియజేసి విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ ఎంపీడీవోలను, హౌసింగ్ ఏఈలను ఆదేశించారు.జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి గృహాలు నిర్మించుకునే 21,910 మంది లబ్ధిదారులకు 114.24 కోట్ల రూపాయల అదనపు సాయం అందుతుందన్నారు. ఈ అవకాశాన్ని గృహ లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేందుకు విస్తృత ప్రచారం నిర్వహించి ప్రోత్సహించాలని హౌసింగ్ ఏఈలను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో మే నెలాఖరు నాటికి 7,069 గృహాలు పూర్తిచేయాలని కేటాయించిన లక్ష్యాన్ని రోజువారి లక్ష్యంగా నిర్దేశించుకుని పూర్తి చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న 17,347 పొజిషన్ సర్టిఫికెట్ల జారీకి సంబంధించి సంబంధిత తహసిల్దార్లతో మాట్లాడి క్లియర్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. పీఎం జన్మన్ కింద ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, పాణ్యంలోని చెంచుగూడేలలో 527 గృహాలు నిర్మించాల్సి ఉందని అందుకు యూనిట్ విలువ 2.29 లక్షల రూపాయలకు అదనంగా మరో లక్ష రూపాయలు అదనపు సాయం అందుతుందని కలెక్టర్ తెలిపారు. పూర్తి చేసిన నిర్మాణాలకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు జనరేట్ చేస్తే చెల్లింపులు జరుగుతాయని కలెక్టర్ తెలిపారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News