కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు వేగవంతం
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు వేగవంతం
-న్యాయశాఖ కార్యదర్శితో మంత్రి ఫరూక్ సమీక్ష
అమరావతి ప్రతినిధి. డిసెంబర్ 04 . (నంది పత్రిక ):కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడంలో భాగంగా కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ శాఖ విభాగం( లీగల్, లెజిస్లేటివ్ అఫైర్స్, జస్టిస్ ) కార్యదర్శిగా జి ప్రతిభా దేవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు ఫ్యామిలీ కోర్టు, నాలుగవ జిల్లా అదనపు సెషన్స్ జడ్జి గా పనిచేస్తున్న ప్రతిభా దేవిని గత నెల 22వ తేదీన రాష్ట్ర న్యాయ విభాగం కార్యదర్శి గా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. రెండేళ్ల పాటు డిప్యూటేషన్ పై ప్రతిభా దేవి న్యాయశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా న్యాయ విభాగం కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభా దేవి, మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ సిహెచ్ శ్రీధర్ లతో మంత్రి ఫరూక్ న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖలకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోడమే కాకుండా, శాసనసభ,శాసనమండలిలో ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందని పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయంపై పకడ్బందీగా కార్యాచరణ చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం కర్నూలు ను న్యాయ రాజధాని అంటూ ప్రజలను మభ్యపెట్టడం జరిగిందని అన్నారు. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుతో న్యాయపరమైన సేవలు సీమ జిల్లాల ప్రజలకు అత్యంత చేరువ కానున్నాయని అన్నారు.మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ సిహెచ్ శ్రీధర్ తో రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు పునర్నిర్మానంపై మంత్రి ఫరూక్ చర్చించారు.
Comment List