మహాశివరాత్రి సందర్భంగా శివ క్షేత్రాలలో ఏర్పాటుచేసే రెడ్ క్రాస్ వైద్య శిబిరాలకు మందులు పంపిణీ
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మహాశివరాత్రి సందర్భంగా నంద్యాల జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసే ఉచిత వైద్య శిబిరాలకు అవసరమయ్యే మందులను అక్కడ వైద్య శిబిరం నిర్వహించే నిర్వాహకులకు పంపిణీ చేయడం జరిగిందని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మారుతి కుమార్, ట్రెజరర్ నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉస్మాన్ భాష, ప్యాట్రన్ సభ్యుడు సుధా మోహన్ రెడ్డి, మహానంది మండల రెడ్ క్రాస్ కన్వీనర్ అమర్నాథ్, సభ్యుడు స్వాములు, బండి ఆత్మకూరు మండల రెడ్ క్రాస్ కన్వీనర్స్ షరీఫ్, నూర్ భాషా, శ్రీనివాసులు, బనగానపల్లె మండలం రెడ్ క్రాస్ కన్వీనర్ సైపుల్ల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దస్తగిరి మాట్లాడుతూ శ్రీశైలం పుణ్యక్షేత్రం పరిధిలోని పెచ్చేరువు, నంది మండపం, కైలాస ద్వారం తదితర ప్రాంతాలలో, మహానంది, ఓంకారం, భోగేశ్వరం, యాగంటి, డోన్ బుగ్గ పుణ్యక్షేత్రాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
వైస్ చైర్మన్ మారుతి కుమార్ మాట్లాడుతూ భక్తులకు అవసరమయ్యే మందులు అందజేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గారికి, కాత్యాయని మెడికల్ స్టోర్ వారికి రెడ్ క్రాస్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉస్మాన్ భాష మాట్లాడుతూ ఈ వైద్య శిబిరాలలో మొట్ట మొదటిసారిగా శ్రీశైలంలో రెడ్ క్రాస్ మొబైల్ హెల్త్ వ్యాన్ భక్తులకు అందుబాటులో ఉంటుందని, అందులో ఈసీజీ, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తదితర అత్యాధునిక పరికరాలు ఉంటాయని ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో ఈ వాహనం భక్తుల కొరకు వినియోగిస్తామన్నారు. జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాలలో రెడ్ క్రాస్ తరఫున ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, రెడ్ క్రాస్ కమిటీ సభ్యులతో పాటు స్థానిక ఆర్ఎంపీ వైద్యులు ఈ మూడు రోజుల పాటు శివరాత్రికి వచ్చే భక్తులకు ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు ఉచిత మందులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మహానంది అమర్, యాగంటి సైపుల్ల, ఓంకారం శ్రీనివాసులు, షరీఫ్ లు మాట్లాడుతూ శ్రీశైలం పరిధిలో దాదాపు ఐదు రోజులకు పైగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, మిగతా ప్రాంతాల్లో శివరాత్రి రోజు నుండి మూడు రోజులు పాటు రాత్రి పగలు వైద్య శిబిరాలు రెడ్ క్రాస్ సభ్యుల, గ్రామీణ వైద్యుల సహకారంతో నిర్వహిస్తామని తెలిపారు.
Comment List