జాతీయ అవార్డును అందుకున్న మహానంది ఏపి మోడల్ స్కూల్

On

వరుస విజయాలతో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న ఆదర్శ పాఠశాల

IMG_20250223_210735

మహానంది ఫిబ్రవరి 23 (నంది పత్రిక ):-మహానంది మండల కేంద్రం యం.తిమ్మాపురంలోని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాల నుండి జాతీయస్థాయిలో ఎంపికైన ప్రాజెక్టుకు గాను విప్రో ఎర్థియన్ అవార్డ్ ను అంతర్జాతీయ కార్పొరేట్ దిగ్గజ సంస్థ అయిన విప్రో లిమిటెడ్ సీఈఒ అనురాగ్ బెహర్ చేతుల మీదుగ అందుకోవడం ఆనందదాయకమని ప్రిన్సిపాల్ కె.లక్ష్మణరావు తెలిపారు.వేల సంఖ్యలో ప్రవేటు విద్య సంస్థలను సైతం వెనక్కు నెట్టి అగ్ర స్థానంలో నిలిచిన తమ పాఠశాల ప్రాజెక్టు ఈ అవార్డు అందుకోవడం తమ పాఠశాలకే కాకుండా అందరికీ గర్వ కారణమన్నారు.ఈ నెల 22 వ తేదిన బెంగుళూరులోని అజీజ్ ప్రేమ్ జీ విశ్వవిద్యాలయంలో 14 వ అవార్డ్ ల ప్రధానోత్సవ సభను జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించారు.జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాలనుండి మొత్తం 23 ప్రాజెక్టులు ఎంపికకాగా అందులో దక్షిణ భారతదేశం నుంచి ఎంపికైన రెండు ప్రాజెక్టులు మన ఆంధ్రప్రదేశ్ కే దక్కటం మన రాష్ట్రానికి గర్వకారణమన్నారు.పాఠశాల వృక్ష శాస్త్ర అధ్యపకురాలు శైలజ పర్యవేక్షణలో విద్యార్థులు గీతావాణి,సుజాత, అఖిల, ఆకాంక్ష, జయంత్ కుమార్ ల కృషికి గాను వారు అనురాగ్ బెహర్ చేతుల మీదుగా అచీవర్స్ అవార్డ్ తో పాటు 50 వేల నగదు బహుమతిని అందుకున్నారు.ఈ బృందంతో విప్రో సిఈఓ అనురాగ్ బెహర్ జరిపిన చర్చలో మహానంది క్షేత్రంలోని కోనేరులో గల నీటి స్వచ్ఛత గురించి,అలాగే కొన్ని వేల సంవత్సరాల క్రితం నంద్యాల ప్రాంతంలో సముద్రం ఉండేదని అందుకు సంబంధించిన ఆనవాళ్ళకు బేతంచర్లలోని బిల్వస్వర్గం గుహలే ఆధారమని శైలజ పర్యవేక్షణలో తయారుచేసిన ప్రత్యేక డాక్యుమెంటరీ ద్వారా విద్యార్థులు వివరించగా విద్యార్థుల బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా నంద్యాల జిల్లా విద్యాశాఖాధికారి పి.జనార్ధన్ రెడ్డి జాతీయ అవార్డ్ సాధించిన బృందాన్ని ప్రశంసించారు.భవిష్యత్తులో సమాజం మరియు ప్రకృతితో మనిషిని అనుసంధానం చేసి జీవవైవిధ్యాన్ని కాపాడటానికి కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.ఈ ఘన విజయాన్ని సాధించిన పాఠశాల బృందాన్ని ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు,గ్రామ పెద్దలు అభినందించారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News