శ్రీశైలంలో నందీశ్వరస్వామివారికి విశేషపూజలు
శ్రీశైలం. ఫిబ్రవరి 10 . (నంది పత్రిక ):
శ్రీశైలంలో నందీశ్వరస్వామివారికి విశేషపూజలు త్రయోదశి సందర్భంగా నందీశ్వరస్వామి వారికి పరోక్షసేవగా విశేషార్చన జరిపించబడుతుంది. ప్రతి మంగళవారం రోజున మరియు త్రయోదశిరోజులలో దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది. అయితే ప్రతి నెలలోకూడా త్రయోదశి రోజులలో అనగా శుద్ధ త్రయోదశి మరియు బహుళ త్రయోదశి రోజులలో భక్తులు నందీశ్వరస్వామివారి పూజను పరోక్షసేవగా జరిపించుకునే అవకాశం కూడా కల్పించబడింది. కాగా సోమవారం మొత్తం 27 మంది భక్తులు పరోక్షసేవగా ఈ నందీశ్వరస్వామి విశేషపూజను జరిపించుకుంటున్నారు. సోమవారం నిర్వహించబడుతున్న పరోక్షసేవలో తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ విశేషపూజను నిర్వహించుకుంటున్నారు.
ఈ పూజాదికాలలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజజరిపించబడుతుంది. ఆ తరువాత నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ, పలు ఫలోదకాలతోనూ హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం మరియు మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహించనున్నారు. తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం నిర్వహించడం జరుగుతుంది.పురుషసూక్తం, వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా ఈ విశేషాభిషేకాన్ని చేయడం జరుగుతుంది. తరువాత నందీశ్వరస్వామివారికి నూతనవస్త్ర సమర్పణ, విశేషపుష్పార్చనలు జరిపించబడుతాయి. తరువాత నానబెట్టిన శనగలను నందీశ్వరస్వామివారికి సమర్పిస్తారు. చివరగా స్వామివారికి నివేదన సమర్పించబడుతుంది.
Comment List